జూబ్లీహిల్స్ పబ్ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఓ ఇంగ్లీష్ సైట్ లింక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ, వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైంది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు ఆనంద్.
గత నెల 28న జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా పబ్ దగ్గర 17 ఏళ్లు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు నిందితులు. ఈ కేసులో మొత్తం ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే.. కేసు నమోదు, విచారణ జాప్యంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. ప్రముఖుల పిల్లలు కావడంతో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ ఘటనపై సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. నిందితులు ఎవరైనా ఊరుకోమని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. కానీ.. ఎంఐఎం నేతల పిల్లలను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.