మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్ ను కేటీఆర్ సందర్శించి.. అనంతరం ట్రాక్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
”మహింద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ” అంటూ మహింద్రా కంపెనీ ట్రాక్టర్ ముందు భాగంలో నిలబడి ఫోజులిస్తున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన ఆనంద్ మహింద్రా.. తనదైన శైలిలో సరదాగా రీట్వీట్ చేశారు.
”కేటీఆర్ మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఇక్కడ ఓ సమస్య ఉంది.. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది” అంటూ ఆనంద్ మహీంద్రా చమత్కారంగా ట్వీట్ చేశారు.
అయితే.. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆసక్తికర సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి సంభాషణపై స్పందిస్తున్ననెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు కేటీఆర్ కు సానుకూలంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.