- అగ్నివీరులకు ఆనంద్ మహీంద్రాలో ఉద్యోగ అవకాశాలు
త్రివిధ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ స్కీం తీసువచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు నడుస్తుండగానే, మరోవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ పట్ల కొంతమంది విమర్శిస్తుంటే..యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎక్కువ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనల పట్ల ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా అగ్నిపథ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
అగ్నిపథ్ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయన్నారు ఆనంద్ మహీంద్రా. అటువంటి శిక్షణ పొందిన, సమర్ధులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశం కల్పిస్తామంటూనే.. మహీంద్రా గ్రూప్ తరఫున వెలకం చెప్పారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో హింస చెలరేగడం బాధ కలిగించిందన్నారు. అగ్నిపథ్‌లో పనిచేసిన యువతకు మహీంద్రా సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుంది అని ఆయన రాసుకొచ్చారు.
అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఎలాంటి పోస్ట్ ఇవ్వనుందని ప్రశ్నించిన ఓ నెటిజన్ కు సమాధానమిచ్చిన ఆనంద్ మహీంద్రా.. నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ట్రైనింగ్ వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ నుంచి సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వరకూ అన్ని విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
మరోవైపు దేశంలో పలుచోట్ల అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నా.. కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇకపై అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు ఉంటాయని తేల్చి చెప్పింది. మరోవైపు అగ్నివీరుల కోసం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలో 10 శాతం ఉద్యోగ ఖాళీలను అగ్నివీర్ ల కోసం కేటాయించనున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి.