ఈ మధ్యకాలంలో వార్తలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ యాంకర్ అనసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు. ఏపీకి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు అనే వ్యక్తిని అనసూయ కేసు ప్రకారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.
అతని మీద 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 2018 చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. సదరు వ్యక్తి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఆమె ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సదరు నిందితుడు 267 ట్విట్టర్ అకౌంట్లు మైంటైన్ చేస్తూ వాటి ద్వారా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నట్లుగా గుర్తించారు. సదర్ నిందితుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పసలపూడి అనే గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. గతంలో మూడేళ్లపాటు దుబాయిలో ప్లంబింగ్ వర్క్ చేసినందుకు తర్వాత మన దేశానికి తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.
సినీ పరిశ్రమలోని హీరోయిన్లు, యాంకర్స్ టార్గెట్ చేస్తూ వారి హాట్ ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా గుర్తించారు. కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవేవీ అతను మార్ఫ్ చేసిన ఫోటోలు కావు సోషల్ మీడియాలో సదరు సెలబ్రిటీలు షేర్ చేస్తున్న ఫోటోలు అతను కూడా షేర్ చేస్తూ వాటి మీద అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లు గుర్తించారు.