ఉపాధిహామీ పనికి వెళ్ళిన కూలీలను అదృష్టం పలకరించింది. పనిచేస్తున్న చోట నిధి లభ్యమయ్యింది. వెండినాణాలతో నిండిన ఓ కుండ దొరకడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే దొరికిన నిధిని గుట్టుచప్పుడు కాకుండా సమానంగా పంచుకున్నారు.
నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొద్ది రోజుల తర్వాత కూలీలు కుండను పగలగొట్టి నాణేలు పంచుకున్న విషయం అధికారులకు తెలిసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిలో నాణేలు దొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తహసీల్దార్ విచారణ చేసి నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కుండలో మొత్తం 27 వెండి నాణాలు దొరికినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈనెల 9వ తేదీన దొరకగా ఆరోజు 18 మంది కూలీలు పనిచేశారని గుర్తించారు.
వారంతా ఎక్కడున్నారో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నాణాలు నిజాం రాజుల నాటివని, మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలామణి అయ్యాయని అధికారులు తెలిపారు.తహసీల్దార్ కనకయ్య, ఎస్సై ప్రమోద్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి తదితరులు విచారణలో పాల్గొన్నారు.