ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని మోడీ. ఎందరో సుల్తాన్ లు పుట్టుకొచ్చినా, నేలకూలినా.. బెనారస్ మాత్రం అలాగే చెక్కుచెదరకుండా ఉందని కొనియాడారు. అత్యద్భుతంగా పునర్ నిర్మాణం చేసిన కాశీ విశ్వనాథుని కారిడార్ ను ప్రారంభించారు ప్రధాని. గంగానదిలో పుణ్యస్నానం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు భవనాల సముదాయం కాదన్న మోడీ.. భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని చెప్పారు. భవిష్యత్ కోసం పూర్వీకులు అందించిన ప్రేరణ ఇక్కడ కనిపిస్తుందన్నారు. ఈ అభివృద్ధి పనులు దేశానికి సరికొత్త దిశ, భవితను చూపిస్తాయని తెలిపారు. విశ్వనాథుడికి ప్రియమైన సోమవారం నాడు కాశీలో కొత్త అధ్యాయం లిఖిస్తోందన్నారు.
కారిడార్ నిర్మాణంలో శ్రామికుల కష్టం వెలకట్టలేనిదని చెప్పారు ప్రధాని. కరోనా టైమ్ లోనూ నిర్మాణం ఆపకుండా పని చేశారని ప్రశంసించారు. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు.. ఈ కారిడార్ కూడా అలాగే జరిగిందన్న ప్రధాని…కాశీ విశ్వనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రాచీన వైభవాన్ని ఈ కారిడార్ కళ్లకు కడుతోందని అన్నారు. ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారని.. ధ్వంసం చేయాలని చూశారని ఆనాటి విషయాలను గుర్తు చేశారు ప్రధాని.
అంతకుముందు మోడీ వారణాసి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికారు. మోదీ, మహాదేవ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. దారిలో ఓ వ్యక్తి అభిమానంతో ఇచ్చిన టోపీ ధరించారు మోడీ. అనంతరం బాబా కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని.. తర్వాత పూజ, అర్చన నిర్వహించారు. కాలభైరవుడికి హారతి కూడా ఇచ్చారు. తర్వాత లలితా ఘాట్ కు చేరుకున్న ప్రధాని గంగానదిలో పుణ్యస్నానం చేశారు. నదిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి పూజలు చేశారు. కలశంతో పుష్పాలు వదిలారు. అనంతరం కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకుని ఆలయ కారిడార్ ను ప్రారంభిస్తారు. రూ.399 కోట్ల వ్యయంతో ఈ కాశీ విశ్వనాథ్ థామ్ ఫేజ్-1 నిర్మాణం జరిగింది.
Advertisements