ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ నింపాయి. దీంతో చాలా కాలం తరువాత హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ నిర్వహించడానికి సిద్దమైంది. అంతే కాదు ఈనెల 28 వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలకు అధిష్టానం ప్రణాళిక రచించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు, సంస్థాగత కార్యక్రమాల కార్యాచరణను ఈ మీటింగ్ లో రూపొందించనుంది. అదే విధంగా మే నెలలో జరిగే మహానాడు నిర్వహణతో పాటు పలు అంశాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ నేతలు చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై విశ్లేషించి ఈ సమావేశాల్లో తెలుగు తమ్ముళ్లు తీర్మానాలు చేయనున్నారు.
ఇక 42 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ,నెల్లూరు, కడప జిల్లాల్లో పార్టీ జోన్ 1, జోన్ 4, జోన్ 5 సమావేశాలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని ప్రజలతో పంచుకోవడం కోసం ఈ సమావేశాల తరువాత బాబుతో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. పేరుతో ప్రజా సమస్యలపై నియోజక వర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ఇక అన్ స్టాపబుల్ అని స్టేట్ మెంట్ ఇచ్చి తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ నింపారు.