తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఎన్నోవచ్చాయని ఆయన తెలిపారు.
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని.. సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత కేటీఆరే అంతటి సమర్థవంతమైన నాయకుడని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. దీంతో తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని స్పష్టం చేశారు. అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇక ప్రతిమ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మంత్రి కేటీఆర్ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభిస్తారని ఎర్రబెల్లి తెలిపారు.