విజయవాడ : చిన్న చేపను పెద్ద చేప మింగి బలుస్తుంది. అది ప్రకృతి సహజం. చిన్న బ్యాంకుల్ని పెద్ద బ్యాంక్ వచ్చి ఆక్రమిస్తుంది. ఇది ప్రభుత్వ సహజం. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తాయని ఆంధ్రా కోడలు సీతమ్మ చెప్పడంతో అందరూ కాస్త కంగారుపడ్డారు. తమ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్స్ ఇంట్లో ఎక్కడున్నాయో వెతుక్కుని పెట్టుకున్నారు. ఐతే..ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఆంధ్రా ల్యాండ్ మార్క్ ఆంధ్రాబ్యాంక్ సీతమ్మ దెబ్బతో ఇక అడ్రెస్ కోల్పోతుంది.
ఇప్పటి వరకు 27 బ్యాంకులుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక నుంచి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా మారిపోతున్నాయి. యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులన్నీ కలిపి ఒకే బ్యాంకుగా విలీనం కానున్నాయి. ఏదైనా జరగనీయండి.. కానీ, మన ఆంధ్ర పేరుతో మిగిలిన ఒకే ఒక వారసత్వాన్ని కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా చేస్తామనడమే దురదృష్టకర పరిణామం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆంధ్రాబ్యాంక్‌ను ఏర్పాటుచేశారు. ఆరోజుల్లోనే ఆంధ్రుల కీర్తికి ఆంధ్రాబ్యాంక్ ఒక పతాకగా నిలిచింది. లక్ష రూపాయల ప్రాధమిక మూలధనంతో ప్రారంభమైన ఆంధ్రాబ్యాంక్ ఇప్పుడు దాదాపు 4 లక్షల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి చేరింది. ఇప్పుడు విలీనం నిర్ణయంతో ఉనికి కోల్పోతుంది. కనీసం ఆంధ్రాబ్యాంక్ పేరును కొనసాగించితే భోగరాజు ఆశయం సజీవంగా ఉంటుందని ఆంధ్రుల ఆశ. ఆంధ్రా ల్యాండ్ మార్క్ చిరస్థాయిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆదిశగా రాష్ట్రానికి చెందిన పెద్దలంతా సెంటర్‌పై ఒత్తిడి తెచ్చి ఆంధ్రాబ్యాంక్ పేరు కొనసాగించాని జనం ఆశ. ఇప్పటికే బ్యాంక్ ఉద్యోగులు విలీనంపై నిరసన గళం వినిపిస్తున్నారు. దీనికి ఆంధ్రులంతా సంఘీభావం ప్రకటిస్తే బెటర్.