అమూల్ రాకతో పాడి రైతులకు లీటర్ పాలపై రూ.20 వరకు అదనంగా లబ్ధి కలుగుతోందన్నారు ఏపీ సీఎం జగన్. కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారాయన. కృష్ణా జిల్లాలో చేపట్టిన ట్రయల్ రన్ రైతులకు లాభాలను తెచ్చిపెట్టిందన్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడపల్లో పాలవెల్లువ కార్యక్రమం మొదలైందని.. కృష్ణా జిల్లాకు కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. మొత్తం 264 గ్రామాల్లో ఇది అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ పథకంతో పాడి రైతులకు మరింత మెరుగైన ధర వస్తుందన్నారు జగన్. అమూల్ సంస్థ ఇప్పటివరకు 148 లక్షల లీటర్ల పాల సేకరణ చేసిందని… ఇతర డైరీలతో పోల్చితే రూ.10 కోట్లు అదనంగా ఇచ్చిందని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సహకార డెయిరీలను ఆదుకుంటున్నామన్న సీఎం… ఈ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభించనుందని తెలిపారు.