ఏపీలో సెలక్ట్ కమిటీ వ్యవహారం చినికి చినికి గాలివానలాగా మారుతోంది. మండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేనంటూ అసెంబ్లీ- మండలి కార్యదర్శి బాలకృష్ణమచార్యులు మండలి. చైర్మన్కే సమాధానం ఇచ్చారు. అయితే చైర్మన్ ఆదేశాలను పాటించకపోవడం మండలి చరిత్రలో ఇదే ప్రథమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మండలి చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు బాలకృష్ణమాచార్యులు సభా ధిక్కరణ విచారణ ఎదుర్కొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న crda రద్దు, మూడు రాజధానుల బిల్లులకు మండలిలో చుక్కెదురు కావడంతో.. ఆ బిల్లులను మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. ఈ బిల్లులపై చర్చించేందుకు సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలనీ చైర్మన్ భావించినా అందుకు వైఎసార్సీపీ మోకాలుడ్డుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీలో శాసన సభకు, మండలికి కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో సెలక్ట్ కమిటీ వ్యవహారంలో ముందడుగు పడటంలేదు. వాస్తవానికి అసెంబ్లీకి, మండలికి వేర్వేరుగా కార్యదర్శులు ఉండాలి కానీ ఇదివరకు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఎవర్ని నియమించలేదు.
దాంతో శాసన సభ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులు.. మండలి కార్యదర్శిగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. శాసన సభలో వైస్సార్సీపీకి, మండలిలో టీడీపీకి మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీ వ్యవహారంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మండలి కార్యదర్శి పై వైసీపీ ఒత్తిడి తెస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని..సెలెక్ట్ కమిటీ ఫైల్‌ను రెండోసారి వెనక్కు పంపారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇదిలా ఉండగా… రెండు రోజుల్లో తన ఆదేశాలను పాటించాలని రెండు రోజుల క్రితం మండలి చైర్మన్ మండలి కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. కానీ చైర్మన్ ఆదేశాలను తాను పాటించలేనని శుక్రవారం చైర్మన్ కు తేల్చిచెప్పారు. చైర్మన్ ఆదేశాలపై కొంతమంది అభ్యంతరాలను తెలిపినందు వల్ల.. తాను చైర్మన్ షరీఫ్ ఆదేశాలను పాటించలేకపోతున్నాని పేర్కొన్నారు. చైర్మన్ కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబడుతుండగా.. మండలి సెక్రటరీ అందుకు నిరాకరించడం పట్ల పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మండలి సెక్రటరీపై కోర్టుకెళ్లే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో టీడీపీ కీలక నేతలు సమావేశం అవుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో, పార్లమెంటరీ అనుభవం ఉన్నవారితో చర్చించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మండలి కార్యదర్శిపై సభా హక్కుల ధిక్కరణ అభియోగం మోపాలని కొంతమంది ఎమ్మెల్సీలు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. సెలెక్ట్ కమిటీ ఫైల్‌ను రెండోసారి వెనక్కు పంపడం సభా హక్కుల ధిక్కారణ కిందకే వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
మొత్తానికి వైసీపీ ప్రభుత్వానికి తాను అనుకున్నది చేసి తీరాల్సిందే అనే ధోరణి ఉన్నట్టు కనిపిస్తోంది.సెలెక్ట్ కమిటీకి పంపిస్తే వచ్చే నష్టం ఏంటన్నది కూడా వైసీపీ నేతలు చెప్పలేకపోతున్నారు.టీడీపీ ఎత్తుగడ ను తిప్పికొట్టడమే వైసీపీ పనిగా కనిపిస్తోంది. రాజ్యం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదానికి ఈ ఘటన నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.