తిరుపతి ఎయిర్ పోర్ట్ తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ప్రోటోకాల్ విషయంలో అక్కడ ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు, జిల్లాకు చెందిన రాజకీయ నేతలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎయిర్ పోర్ట్ అధికారులు తన పట్ల ప్రవర్తించిన తీరుకు మనస్థాపం చెందిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన భూమన అభినయ్.. తన రూట్లో వెళ్లి వారికి షాక్ ఇచ్చారు.
తిరుపతి ఎయిర్పోర్ట్, అలాగే అధికారుల రెసిడెన్షియల్ క్వార్టర్స్ కు నీటి సరఫరాను నిలిపివేశారు. దీనిపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు. అభినయ్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు.
కాగా, ఇటీవల రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తిరుపతి పర్యటనకు విమానంలో వచ్చారు. అయితే డిప్యూటీ మేయర్ హోదాలో స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ వెళ్లిన భూమన అభినయ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ఆయన్ను అధికారులు నిలిపివేశారు.
ఆ సమయంలో రెండు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో అభినయ రెడ్డి ఎయిర్పోర్ట్ కు నీటి సరఫరాను నిలిపి వేయాలంటూ అధికారులను ఆదేశించారు.