రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. గౌరవరం జాతీయ రహదారి పై ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరావు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హైవే పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద ఆయన టీ తాగడానికి వెళ్లారు.
ఆ సమయంలో ఆయన వద్దకు ఓ వ్యక్తి తన జేబులోని సెల్‌ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని మరి వచ్చి వెంకటేశ్వరరావు ని పలకరించారు. ”ఏంటి సార్…జగన్ ప్రతినెలా జీతాలు ఇస్తున్నారా? ” అంటూ ప్రశ్నించారు. అసలు ఆ ప్రశ్న ఆయన నోటి నుంచి రావడమే ఆలస్యం.. వెంకటేశ్వర రావు ఆక్రోశం, ఆగ్రహం కలగలిపి జగన్‌పై విరుచుకుపడ్డారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది.
ఆ విషయం కానిస్టేబుల్‌కు తెలియనప్పటికీ… ‘నాకేం భయం లేదు. కావాలంటే వీడియో తీసుకోవచ్చు’ అని చెప్పారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెంకటేశ్వరరావుపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి, రిమాండుకు పంపించారు. ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ టి.కాంతిరాణా ఆదేశాలు జారీ చేశారు.