అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సంక్షేమం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని గవర్నర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభా సమావేశాలను ప్రారంభించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఆర్ధికాభివృద్ధిలో ఆంధ‌్రప్రదేశ్ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నట్లు గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవంలో వివరించారు. ఏపీలో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నట్లు వివరించారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
అవినీతికి తావులేవకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. నాలుగేళ్లుగా ఏపీలో సుపరిపాలన అందించినట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారి సంక్షేమ పథకాల అమలు కోసం వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. కూరుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీను, వైఎస్సార్ కడపలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 80లక్షల మంది పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 44.49లక్షల మంది తల్లులకు రూ.19.61కోట్ల రుపాయలను నేరుగా బదిలీ చేసినట్లు చెప్పారు.
గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో శాసన సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుంది. శాసససభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది బిఏసిలో నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 7,8 రోజుల సభా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బిఏసి సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు క్యాబినెట్ అమోద ముద్ర వేయనుంది.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రూ.2.60లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంక్షేమంతో పాటు నగదు బదిలీ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వరాలు కురిపించే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందు చివరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో కీలక అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వివరాలను గవర్నర్ సభకు వివరిస్తున్న క్రమంలో శాసనసభ్యులు ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు