ఆక్వా రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ అక్వా రైతులకు ప్రోత్సాహకంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందేలా నిర్ణయించారు. తాజాగా, ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేసారు.
వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు లో సీఎం కు వివరించారు. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు వాపోయారు. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేసారు.
తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వెంటనే అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.