విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమ్మిట్ ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామిక వేత్తలు ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.
పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు తరలి రావడంతో.. వారి కోసం హెలీకాఫ్టర్లు, లగ్జరీ కార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతుంది. ఈ సమ్మిట్ కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హై కమిషనర్ లు తరలివచ్చారు.
ఇక మరోవైపు దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాల్లో ఫేమస్ అయిన వెజ్ అండ్ నాన్ వెజ్ రుచులను వీరికి అందించే ఏర్పాట్లను చేశారు. శుక్ర, శని వారాల్లో విశాఖ వేదికగా జీఐఎస్ జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో.. బొమ్మిడాయిల పులుపు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, మష్రూం, పన్నీర్, ఆలూ గార్లిక్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీస్, మిర్చీ కా సాలన్, టామాటో పప్పు, మజ్జిగ పులుసు, వడియాలు, కట్ ప్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీ, జున్ను మొదలైనవి సిద్ధం చేశారు.
శనివారం ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, టమాటా బాత్, హాట్ పొంగల్, ప్లమ్ కేక్, డ్రై కేక్, స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ లో.. రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్స్, రుమాలీ రోటీ, బటర్ నాన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, గోంగూర రొయ్యల కూర, మటన్ పలావ్, వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీర్, బెండకాయ-జీడిపప్పు ఫ్రై, పప్పు చారు, ఉలవచారు మొదలైనవి ఉండబోతున్నాయి.