తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ముద్దుగా పెంచుతారో, వారి భవిష్యత్తు బావుండాలని ఎన్ని కలలు కంటారో, ఎంత కష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రంపంచంలో మన బాగుకోరే నిస్వార్ధపరులు ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులే.
అయితే ఆస్తి పంచి ఇవ్వలేదని ఓ కొడుకు తన తండ్రికి తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తన బాధ్యత తాను నిర్వహించడానికి డబ్బు డిమాండ్ చేసాడు. ఈ దారుణమైన సంఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులో వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మ చేసేందుకు తనయుడు రామారావు నిరాకరించాడు.
ఆస్తి విషయంలో తరచూ తల్లిదండ్రులతో విగ్వాదానికి దిగేవాడు. దాంతో గుమ్మడిదుర్రులోనే ఆరేళ్లుగా కూతురు వద్దే తలదాచుకుంటున్నారు వృద్ధ దంపతులు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా కొడుకు భీష్మించకుని కూర్చున్నాడు.
గతంలో కోటయ్య ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తానని మొండికేశాడు. ఇక చేసేదేమీ లేక…గుమ్మడిదుర్రులో కుమార్తె విజయలక్ష్మి తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. డబ్బు కోసం కన్నతండ్రికి తలకొరివిపెట్టని వ్యక్తిపై దుమ్మెత్తిపోస్తున్నారు జనాలు.