గులాబ్ తుపాను దెబ్బకు ఏపీ విలవిలలాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వణికిపోతోంది. కళింగపట్నం దగ్గర తీరం దాటిన తుపాను.. క్రమంగా తీవ్రత తగ్గి వాయుగుండంగా మారింది. ఇంకొన్ని గంటల్లో బలహీన పడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. వేగంగా కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుపాను వల్ల ఇళ్లు, కాలనీలు నీటమునిగాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు జలమయం కావడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లను నిలిపివేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 15వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాను ప్రభావం వల్ల మన్యంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం రైల్వే ట్రాక్ పైకి వరద నీరు చేరింది. చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంటోంది. విశాఖ జిల్లాలోనూ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని జలాశయాలలో ప్రమాదస్థాయికి నీటి మట్టం చేరుకుంది.
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు సహా పలు విషయాలపై చర్చించారు. ఏపీలోని మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వానలు పడుతున్నాయి.