రాను రాను తగ్గుముఖం పడతాయిగానీ..! పెళ్ళైన కొత్తలో అల్లుడికి మొహం మొత్తేసే మర్యాదలు జరుగుతాయ్. ఉన్నంతలో ఘనమర్యాదలు చేస్తుంటారు అత్తమామలు. రకరకాల వంటలు,పిండి వంటలతో ప్లేట్లు నింపేస్తారు. అప్పటి దాకా ఉన్న పేదరికానికి పరదాలు కప్పేస్తారు.
ఇక అత్తింట్లో కూడా మర్యాదలు జరక్కపోతే, వాడు దురదృష్టవంతుడూ.. శాపగ్రస్తుడికిందే లెక్క. కూతురి మీద ప్రేమ పేరుతో అల్లుడింట్లో పడితినే అత్తమామలు కూడా లేకపోలేదు ఇది వేరేవిషయం.
అయితే.. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో ఓ కుటుంబం అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయే విందుభోజనం ఏర్పాటు చేసింది. తొలిసారి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 108 వంటకాలతో విందు భోజనం పెట్టారు.
పొదలకూరు మండలంలో ఊసపల్లి వాసి, కండలేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఉసా శివకుమార్, శ్రీదేవి దంపతులు తమ కూతురు శివాని, అల్లుడు ఉమ్మిడిశెట్టి శివకుమార్‌ల కోసం ఈ విందును ఏర్పాటు చేశారు.
విందు ఆరగింపును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జిల్లాలోనే ఈ విందు హాట్ టాపిక్‌గా మారింది. మెనూలో చేప, రొయ్యలు, చికెన్, మటన్, శాకాహారం, రసం, సాంబారు, పెరుగు, వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు ఉన్నాయి. ఈ హోమ్ గార్డు కుటుంబం అల్లడి మర్యాదల కోసం బాగానే హోంవర్క్ చేసిందంటున్నారు నెటిజన్లు.