పల్నాడు జిల్లాల్లో కాల్పులు కలకలం రేపాయి. జిల్లాలోని రొంపిచర్ల మండలం ఆలవాలలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ బాలకోటి రెడ్డిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు.
కాల్పుల ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… రొంపిచెర్ల మండలంలో టీడీపీ నేతల మధ్య కొన్ని రోజుల మనస్పర్థలు ఉన్నాయని తెలిపారు. యంపీటీసీ పదవి వివాదంతో పాటు వెంటకటేశ్వర రెడ్డికి బాలకోటి రెడ్డి ఆరున్నర లక్షల రూపాయాలు ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు.
దీంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి బాలకోటిరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చాడన్నారు. శివారెడ్డి పేరుతో డోర్ కొట్టగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు డోర్ తీశారని ఎస్పీ వివరించారు.
దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని ఎస్పీ వెల్లడించారు. వెంకటేశ్వర రెడ్డికి ఫిరంగిపురానికి చెందిన అంజిరెడ్డితో వెంకటేశ్వరరెడ్డికి జైలులో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో తనకు ఓ సాయం చేయాలని అంజిరెడ్డిని వెంకటేశ్వర రెడ్డి అడిగాడన్నారు.
వారు ఇద్దరు కలిసి రాజస్థాన్ లో రూ. 60వేలకు తుపాకీ కొనుగోలు చేశారన్నారు. ఆ తుపాకీతో బాలకోటి రెడ్డి ఇంటికి వచ్చి అతనిపై వెంకటేశ్వరరెడ్డి కాల్పులు జరిపాడని ఎస్పీ చెప్పారు. ఈ హత్యాయత్నానికి వెంకటేశ్వర రెడ్డి ప్లాన్ చేశారని ఎస్పీ పేర్కొన్నారు.