పదవ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించింది జనసేన పార్టీ. జనసేన నాయకులు, కార్యకర్తులు, అభిమానుల నడుమ కృష్ణాజిల్లా మచిలీ పట్నం జనసంద్రాన్ని తలపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఆదరణ లభించింది.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు చెక్కులను పంపిణీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సభలో ప్రసంగించారు. పదేళ్ల కిందట నేను పార్టీ పెట్టినప్పుడు నా వెనుక ఎవరూ లేరని, సగటు మనిషికి మేలు చేయాలనే తపనతో పార్టీ పెట్టానని అన్నారు.
పార్టీ ప్రారంభించిన సమయంలో నాకు రాజకీయాలు తెలియవు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సగటు మనిషికి మేలు చేయాలన్నదే తపన అని అన్నారు. నాకు పింగళి వెంకయ్య స్ఫూర్తి అని, పేదలకు అండగా నిలువాలన్నదే నా ఉద్దేశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మీ అభిమానం నాకు ధైర్యాన్నిచ్చింది.ఎంతో మంది పార్టీలు పెట్టి వదిలేశారు. రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డానని పేర్కొన్నారు. మహా అయితే ప్రాణాలు పోతాయి.. మహానుభావుల స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలున్నారు..తెలంగాణలో 30 వేల మంది క్రియాశీల కార్యకర్తలున్నారన్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని, అదే జనసేన పార్టీని నిలబెడుతుందన్నారు. పార్టీ పెట్టే సమయంలో 7 సిద్ధాంతాలను ప్రతిపాదించామని, రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామని, ప్రజలకు మేలు చేసేందుకు పార్టీ పెట్టామని ఆయన అన్నారు.
జనసేన పార్టీ 6.5 లక్షల క్రియాశీల కార్యకర్తలున్నారన్నారు. కులాలను కలపాలన్నదే నా అభిమతం.. కులాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కమ్మ, కాపు, దళితులు అని మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడినని, ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని పవన్ విమర్శించారు.