రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంటోంది. ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రంగా చలి గాలులు వీస్తుండగా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే, గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దానికి కారణం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
తాజాగా భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం ఒక నివేదిక విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఫిబ్రవరి 1న ఉదయం సమయంలో శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం లలో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాబోయే మూడు రోజులకు ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి అధికారులు నివేదిక విడుదల చేశారు. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో మంగళవారం, బుధవారం నాడు వాతావరణం పొడి ఉంటుందన్నారు.
దక్షిణ కోస్తాంధ్రలో మంగళవారం, బుధవారం తేలికపాటు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం నాడు పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉండనుందన్నారు. ఇక రాయలసీమలో మంగళవారం, బుధవారం నాడు తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.