అవును ! ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగేది కాదని స్పష్టం అవుతోంది. అధికారులు, పర్యాటకులు ఎవరు చదివినా బోటు ప్రయాణంపై అప్రమత్తంగా ఉండేవారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చిందని, ఈ సమయంలో దేవిపట్నం ఏరియాలో పోశమ్మగండి నుంచి పేరంటాల పల్లి వరకు బోట్లు తిప్పడం అత్యంత ప్రమాదకరమని, పర్యాటకుల ప్రాణాలతో ప్రైవేటు బోట్ల వాళ్ళు చెలగాటమాడుతున్నారని ఆంధ్రజ్యోతి కథనంలో హెచ్చరించింది. ప్రస్తుతం విహారం నిషేధం ఉన్నప్పటికీ బోట్లు తిప్పుతున్నారని కథనంలో ఉంది.
ఇంత స్పష్టంగా ప్రమాదకర విహారంపై ఆంధ్రజ్యోతిలో కథనం ఉన్నప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ప్రమాదం జరిగినరోజే ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్ లో ఈ కథనం ప్రచురితమైనప్పటికీ ఆ పత్రికను పట్టించుకోకూడదనే అభిప్రాయంలో అధికారులు, పాలకులు ఉన్నరేమో మరి !!
ఈ కథనం ట్వీట్ చేస్తూ నెటిజన్లు చాలా కామెంట్లు పోస్ట్ చేశారు. పనికొచ్చే పేపర్లు చదవాలని ఒకరంటే, అందుకే బ్యాన్ అని మరొకరు ట్వీట్ చేశారు. మరొకరు ఇది పచ్చ పత్రిక కదా ! ఆ రాతలు మేం చడవాలా ? అంటూ సెటైర్ ట్వీట్ చేశారు.
అయినా ఆంధ్రజ్యోతి హెచ్చరించినట్లుగానే అది పెను ప్రమాదకర విహారయాత్ర అయింది. విషాద యాత్రగా మారింది. ఎంత నిర్లక్ష్యం ? ఎంత బాధ్యతారాహిత్యం ? ఎంత అలసత్వం ? నీట మునిగిన నిండు ప్రాణాలే దీనికి నిదర్శనాలు.