మూడు రాజధానులపై ఏపీ సర్కార్ మళ్లీ ఫోకస్ చేసింది. ఇప్పటికే మహా విశాఖ పరిధిలోకి పలు మండలాలను చేర్చటం, పెండింగ్ లో ఉన్న కర్నూలు విమానాశ్రయంను ఓపెన్ చేయటం… మూడు రాజధానుల కోసమే సీఎం జగన్ పనులు స్పీడప్ చేస్తున్నారన్న అభిప్రాయం వినపడింది. అయితే, కోర్టులో ఉండగా నిర్ణయాలు జరగవుగా అంటూ ప్రతిపక్ష పార్టీలు కొట్టిపారేశాయి.
కానీ మూడు రాజధానులపై ముందుకే వెళ్తామని, ఏ క్షణమైనా విశాఖకు రాజధానిని తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ… త్వరలోనే అన్నింటిని అధిగమించి రాజధానిని విశాఖకు తరలిస్తామన్నారు. సీఎం జగన్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నారని బొత్స కుండబద్ధలు కొట్టారు.
పలువురు ఉన్నతాధికారులు కూడా ఇటీవలే విశాఖలో పర్యటించి వచ్చారని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే… వివిధ శాఖల తరలింపు శరవేగంగా జరుగుతుందని సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
గతంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి బెంచ్ పై ఉన్న ఈ మూడు రాజధానుల పిటిషన్లు, సీఆర్డీయే రద్దు ను సవాల్ చేసిన పిటిషన్లపై కొత్త సీజే మే నుండి రెగ్యూలర్ గా విచారణ చేస్తామని ఇటీవలే ప్రకటించారు.