ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య పంచాయితీ ఎన్నికల పంచాయితీ ముగిసినట్లే కనిపించినా… మున్సిపల్ ఎన్నికలపై రగడ మొదలైంది. వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారి మొబైల్స్ స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ ఆదేశాలపై లంచ్ మోషన్ దాఖలు చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల సేవల వినియోగం ఉండదని, ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెట్టనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయన్న ఆయన, ప్రతిపక్షాలన్నీ వాలంటీర్లు అధికార పక్షానికి సహకరించారని ఫిర్యాదులు చేశాయని అన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అభ్యర్థుల తరఫున ఓటర్లను ప్రభావితం చేయకూడదని, ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరించకూడదని తెలిపారు. ఓటర్ స్లిప్పులను కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దన్నారు. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించారు. దీనిపై వైసీపీ, జగన్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వారిని పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఉందని వాదిస్తుంది.