అసెంబ్లీ తొలి రోజే రైతు బీమా విషయంలో వైసీపీ సర్కార్ ఇరుక్కుపోయింది. దీంతో రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని చెల్లిస్తూ రాత్రి జీవోలు విడుదలయ్యాయి. 590 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్ఆర్ – ఫసల్ బీమా యోజన పథకం కింద చెల్లించారు.
రైతుల సమస్యలు, బీమాపై టీడీపీ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు నేలపై కూర్చొని నిరసన తెలపగా… సర్కార్ సస్పెండ్ చేసింది. మొదట ఇన్సూరెన్స్ కట్టామని ప్రభుత్వం వాదించగా… ఆర్టీఐ ద్వారా తాము సమాచారం సేకరించామని టీడీపీ చెప్పటంతో వైసీపీ మాట మార్చింది. డిసెంబర్ 15వరకు చెల్లిస్తామంటూ ప్రకటించింది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే 590కోట్లను విడుదల చేసింది.
ప్రభుత్వం చేసిన ఈ ఆలస్యం కారణంగా… ఈ ఏడాదిలో 7 నెలలుగా రైతులు నష్టోపోయిన వాటికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు. కానీ ఇక మీద ఎదైనా నష్టం జరిగితే మాత్రం వర్తిస్తుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన నష్టం సంగతే తేలాల్సి ఉంది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామని చెప్పటంతో ఇన్సూరెన్స్ కట్టని రైతులకు ఇప్పుడు తీవ్ర నష్టం వాటిల్లినట్లైంది.