తన రిటైర్మెంట్ ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి తనకు సంబంధం లేని మాటలన్ని మాట్లాడారని, దురుద్దేశపూర్వంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు సర్కార్ భావిస్తుంది.
మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా… జస్టిస్ రాకేష్ కుమార్ దర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే, ఇందులో ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ మీరు విచారణ నుండి తప్పుకోవాలని రిక్విజల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ దాన్ని న్యాయమూర్తి తిరస్కరిస్తూ ఎందుకు తప్పుకోవాలో చెప్పాలని ఆదేశించారు. ఇందుకు సమాధానంగా ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ కుమార్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఏపీ సర్కార్ అఫిడవిట్ ఇవ్వగా… అందుకు సాక్ష్యాధారాలను మాత్రం ప్రభుత్వ లాయర్లు చూపించలేకపోయారు. దీంతో తనను అనని మాటలను అన్నట్లుగా సర్కార్ పేర్కొనటంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కరణ కింద ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
దీంతో ఆ తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అయితే, సుప్రీంలో తన అఫిడవిట్ తప్పుకాదు అని ఎలా నిరూపిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీ సర్కార్ మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో… పలు ప్రభుత్వ ఆస్తులను అమ్మటం ద్వారా కొంత నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, దీన్ని కొందరు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు.