ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లు దిశ బిల్లు. లైంగిక వేధింపుల నిరోధానికి తెచ్చిన ఈ బిల్లు చట్టం అయితే నేరస్థులు వణికిపోవాల్సిందేనని ఏపీ సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకుంది. అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును చట్టం చేసేందుకు కేంద్రం అనుమతి కావాల్సి ఉండటం, బిల్లులో లోటుపాట్లను ఎత్తిచూపుతూ కేంద్రం పదే పదే వెనక్కిపంపుతుండటంతో సమస్య మొదలైంది.
ఇటీవల మరోసారి కేంద్రం దిశ బిల్లును వెనక్కి పంపటంతో… కేంద్ర సూచించిన సవరణలు చేసి, అసెంబ్లీలో మరోసారి బిల్లు పాస్ చేయించుకోవాలని సర్కార్ భావించింది. కానీ, కేంద్రం చెప్పిన సవరణలు చేసేందుకు సమయం పట్టేలా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరణలు చేశాక, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఏపీ సచివాలయ వర్గాలంటున్నాయి.