దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతి మరవకముందే.. క్రికెట్ రంగంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ దుర్మరణం చెందాడు. సైమండ్స్ మృతితో క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
1998లో పాకిస్థాన్ తో జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. మొత్తం 198 వన్డేల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసుకున్నాడు. ఒక మ్యాచ్ లో 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకొపి బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరుపొందాడు.
2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్ ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు.
బౌలింగ్ లో 8 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్ లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.