– ఆ ఐదు కంపెనీలకే కాంట్రాక్ట్
– సన్నకారు రైతులను కాదని..
– అనుకున్నది సాధించిన మంత్రి!
– ముందే లీకులిచ్చి స్కామ్ కి ప్లాన్
– తక్కువ ధరకు నాణ్యత లేని ఇతర రాష్ట్రాల గుడ్లు
– మహిళలు, పిల్లలకు అందని సరైన పౌష్టికాహారం!
తొలివెలుగు క్రైంబ్యూరో చెప్పిందే నిజమైంది. ‘‘స్కామ్ టెండర్స్’’ అంటూ గతేడాది డిసెంబర్ 12న ఓ ఇన్వెస్టిగేషన్ కథనం ఇచ్చాం. బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కేసీఆర్ కొత్త పథకం పెడితే.. సంక్షేమ శాఖ మాత్రం లంచాలకు అలవాటు పడి చిన్న, సన్నకారు రైతులను కాదని ఎక్కువ ధర చెల్లించి తక్కువ సైజ్ గుడ్డును ఇచ్చారని సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాం. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ‘‘స్కామ్ టెండర్స్’’ ని ఎక్కడా ఆపలేదు. ముందే లీకులు ఇచ్చి.. అదనంగా 50 కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడేలా వ్యవహరించింది. ఇది లిక్కర్ స్కామ్ లాంటి స్కీమేనని ఆరోపణలు ఉన్నాయి.
5 కంపెనీల రాయ‘బేరం’ సక్సెస్
170 మంది రైతులను కాదని కార్పొరేట్ కంపెనీలకు అంగన్ వాడీ గుడ్ల టెండర్స్ ఇవ్వడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. టెండర్ల పక్రియ పూర్తి చేయాలని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఆ తర్వాత తుది తీర్పు వరకు వారినే సప్లై చేయాలని ఆదేశాలు వచ్చాయి. స్కీమ్ పేరుతో స్కామ్ కు పాల్పడుతున్నామని తెలిసినా.. హైకోర్టు అంటే భయం కూడా లేకుండానే అనుకున్న నితీషా ఫామ్స్, జేవీ ఫామ్స్, రజిత పౌల్ట్రీ, శ్రీనివాస పౌల్ట్రీ, సిరి ఫామ్స్ కే టెండర్లు ఇచ్చారు. నితీషా ఫామ్స్, జేవీ ఫామ్స్ నెక్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డివే. ఈ కంపెనీలు ఒక్కొక్క గుడ్డు ధర రూ.5.67 కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నాయి. ఈ ధరను గోప్యంగా ఉంచారు. అయితే.. గద్వాల్ జోన్ లో ఒక మండలానికి రీ-టెండర్ జరిగింది. ఇక్కడ బాల్ రెడ్డి హేచరీస్ ఒక్కొక్క గుడ్డుపై 59 పైసలకు తక్కువ కోట్ చేసింది. స్థానిక పౌల్ట్రీ రైతులు తక్కువ ధరకు అందిస్తామని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. గుడ్డుకు 20 పైసల కమీషన్ మంత్రికి చేరుతుందని ఆఫర్స్ ఇచ్చారు. అయినా కాదని 60 పైసలకు ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలకు అగ్ మార్క్ ధ్రువీకరణ పేరుతో ఇప్పటికే రూ.50 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు.
మార్కెట్ ఢమాల్
కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. సబ్సీడీపై దాణా సప్లై చేసింది. కొత్త ఫామ్స్ కి సబ్సిడీ ఇచ్చింది. బ్యాంకు లోన్స్ తక్కువ వడ్డీకే అందిస్తోంది. కోళ్లను పౌష్టికంగా పెంచడంతో ఆ వాతావరణానికి ఒక్కొక్క గుడ్డు 50 గ్రాములకు పైనే ఉంటుంది. టెండర్లలో 45 గ్రాముల గుడ్డు కావాలని పెట్టడంతో తక్కువ ధరకు వచ్చే గుడ్లను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో పెద్ద సైజ్ గుడ్లకు మార్కెట్ లేకుండా పోతోంది. రైతులు నష్టపోతున్నారు.
విచారణ జరిపించాలి!
గుడ్ల స్కామ్ పై గతంలో తొలివెలుగు.. మంత్రిని అడగ్గా తాను గిరిజన మంత్రిని అయినందునే ఇలా అడుగుతున్నారా? అని బదులిచ్చారు. ప్రభుత్వ ఖజానాను కాపాడడానికి అందరూ పాటు పాడాల్సిన అవసరం ఉంది. ఈ స్కీమ్ స్కామ్ లెక్కలు తేలాలంటే విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని ఫెడరేషన్ సభ్యులు కోరుతున్నారు.