సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తోన్న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తమ భూములను స్వాధీనం చేసుకోవటంతో తమకు ఉపాది కరువైందని, కానీ పెండింగ్‌లో ఉన్న తమ ఇళ్ల నిర్మాణాలు, ప్యాకేజీల బకాయిలు ఇవ్వకుండా అధికారులు రోజులు గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
మల్లన్న సాగర్ నిర్మాణ పనులను అడ్డుకొని తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్డీవో, కలెక్టర్ ఎప్పటికప్పుడు గడువు పొడగిస్తున్నారు కానీ తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులను అడ్డుకున్న విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్, పోలీసులు అక్కడికి చేరుకొవటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా… త్వరలో బకాయిలు వచ్చేలా చేస్తామని పోలీసులు హమీ ఇవ్వటంతో గ్రామస్తులు వెనక్కి వెళ్లిపోయారు.
ఈసారి కూడా గడువులోపు బకాయిలు చెల్లించకపోతే… తమ నిరసనను తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.