తన కెరీర్ పై చాలా క్లారిటీతో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సక్సెస్ ట్రాక్ కొనసాగినంత కాలం దర్శకుడిగా ఉంటానని, తగ్గిన వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారతానని చెబుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారితే పెయిడ్ హాలిడే లో ఉన్నట్టు ఉంటుందని చెబుతున్నాడు ఈ డైరక్టర్.
“నటించడం నాకు కొత్త కాదు. షూటింగ్ స్పాట్ లో నేను నటించి చూపిస్తుంటాను. దాదాపు ప్రతి ఆర్టిస్టుకు నేనే నటించి చూపిస్తాను. అలా కెమెరా వెనుక నటించడం నాకు అలవాటే. ప్రస్తుతం సక్సెస్ లు చూస్తున్నాను. ఇక నాకు సక్సెస్ లు రావు అనుకున్న టైమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతాను. అప్పుడిక నాకు సినిమా సక్సెస్ తో పనిలేదు. నా యాక్టింగ్ నేను చేసుకుంటాను, చక్కగా కారవాన్ లో కూర్చుంటాను. డబ్బులు తీసుకుంటాను” అని చెప్పాడు.
అయితే హీరోగా మాత్రం మారనంటున్నాడు ఈ దర్శకుడు. లీడ్ రోల్స్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారమని, దర్శకుడిగా ఫెయిల్యూర్ వచ్చినా తట్టుకోవచ్చేమో కానీ.. హీరోగా ఫెయిల్యూర్ వస్తే తట్టుకోవడం కష్టం అంటున్నాడు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారే ఆలోచనను బయటపెట్టాడు.
ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతోంది ఎఫ్3 సినిమా. విడుదలై 10 రోజులు అయినప్పటికీ ఈ సినిమాకు ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు మేకర్స్. గత వారం బ్రేక్ ఈవెన్ అవుతుందనుకున్న ఈ సినిమా ఇంకా ఆ మార్క్ అందుకోలేదు.