ఈమధ్యే తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. అంతలోనే మరో అప్ డేట్ ఇచ్చాడు నటసింహ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశాడు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా పట్టాలపైకి రాబోతోంది. అంటే, గోపీచంద్ మలినేని సినిమాను మరో 4 నెలల్లో పూర్తి చేయబోతున్నాడన్నమాట.
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనీల్ రావిపూడి. సింహా, అఖండ, లెజెండ్ లాంటి యాక్షన్ సినిమాలకు అడ్రస్ బాలయ్య. మరి వీళ్లిద్దరి కలయికలో సినిమా ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు అనీల్ రావిపూడి స్పందించాడు. తన మార్క్, బాలయ్య మార్క్ రెండూ ఉంటాయని స్పష్టంచేశాడు.
అఖండ విజయం తర్వాత బాలయ్య మళ్లీ స్వింగ్ లోకి వచ్చేశాడు. వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేయడమే కాకుండా, బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. మరో ఏడాది పాటు ఇలానే వరుసగా సినిమాలు చేసి, ఆ తర్వాత ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని అనుకుంటున్నాడు ఈ హీరో కమ్ ఎమ్మెల్యే.