ఎంత పెద్ద సినిమాకైనా విమర్శలు సహజం. అది సమీక్షకులు/విమర్సకుల పని. సద్విమర్శ చేసినప్పుడు తీసుకోవాలి. పనికిమాలిన విమర్శ అనిపించినప్పుడు పక్కనపెట్టేయాలి. కానీ అనీల్ రావిపూడి మాత్రం చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నాడు. మీడియాపై ఫైర్ అయ్యాడు.
ఎఫ్3 సినిమాకు అన్ని రివ్యూస్ బాగా వచ్చాయి. అందరూ మినిమం 2.75 రేటింగ్ ఇచ్చారు. చాలామంది 3 ఇచ్చారు. మరికొంతమంది 3.25 ఇచ్చినోళ్లు కూడా ఉన్నారు. ఇలా రివ్యూలు ఇచ్చే క్రమంలో సినిమాకు నెగెటివ్ గా అనిపించిన అంశాల్ని కూడా ఎత్తిచూపారు. ఫస్టాఫ్ లో కొంత డ్రాగ్ అయిందని, కామెడీ తగ్గిందని రాసుకొచ్చారు. మూర్ఛపోయే ట్రాక్ ను అమ్మో ఒకటో తారీఖు సినిమా నుంచి స్ఫూర్తి పొందరని రాశారు.
అయితే ఈ చిన్నపాటి విమర్శల్ని కూడా రావిపూడి స్వీకరించలేకపోయాడు. సినిమాను సరదాగా నవ్వుకోవడం కోసం తీశామని, అలాంటి సినిమాలో కూడా ఇది తక్కువ, అది ఎక్కువ అని కామెంట్స్ చేయకూడదని క్లాస్ పీకుతున్నాడు. కామెడీ సినిమాలు ఏడాదికి ఒకట్రెండు మాత్రమే వస్తాయని, వాటిలో కూడా ఎక్కువ-తక్కువ చూడొద్దని హితబోధ చేస్తున్నాడు.
ఇక్కడ రావిపూడి గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. సినిమా కామెడీనే, యాక్షనా అనేది సమీక్షకులకు అనవసరం. ఏ సినిమాలో తప్పొప్పులు ఉన్నా ఎత్తిచూపడమే వాళ్ల పని. యాక్షన్ కాబట్టి రివ్యూ ఇచ్చి, కామెడీ సినిమా కాబట్టి విడిచిపెట్టే సమస్య లేదు. ఈ విషయాన్ని రావిపూడి గుర్తుపెట్టుకుంటే మంచిది. సద్విమర్శల్ని లెక్కలోకి తీసుకుంటే అతడికే మంచిది. తీసుకోకపోతే అతడికే నష్టం.