ఎఫ్3 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉంది. ఇప్పటికీ ఆన్ లైన్లో టికెట్లు దొరుకున్నాయి. ఓవైపు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగకపోవడం ఆశ్చర్యం. దీనిపై అనీల్ రావిపూడి స్పందించాడు. ఎఫ్3 సినిమాకు ఎందుకు టికెట్ రేట్లు పెంచలేదో వివరించాడు.
“హైదరాబద్ లో కొన్ని ప్రీమియం మల్టీప్లెక్స్ లో తప్ప మిగతా అన్ని చోట్ల టికెట్ ధరలు అందరికీ అందుబాటులోకే తెచ్చాం. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా ఉంటే ఒకటి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా వుండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు.”
ఇలా ఎఫ్3 సినిమాకు సాధారణ రేట్లు పెట్టడంపై తనదైన విశ్లేషణ ఇచ్చాడు అనీల్ రావిపూడి. మరోవైపు ఈ సినిమాలో నటించిన హీరోలపై స్పందిస్తూ.. కామెడీ చేయాల్సి వచ్చినప్పుడు హీరోయిజం వదిలేయాలని, ఆ విషయంలో వెంకీ రూపంలో తనకు మంచి స్టార్ దొరికాడని చెప్పుకొచ్చాడు.
“కొన్ని సినిమాలు చేయడానికి ఇమేజ్ దాటి రావాలి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంటర్ టైనర్లు చేస్తుంటారు. లక్కీగా వెంకటేష్ గారు నాకు దొరికారు. ఆయన బోర్డర్ దాటి కూడా కొన్ని సీన్లు చేసేస్తారు. కామెడీ సినిమా చేసేటప్పుడు అలానే వుండాలి. ఈ పాత్రలు చెప్పినపుడు వెంకటేష్, వరుణ్ తేజ్ చాలా ఎక్సయిట్ అయ్యారు. వెంకటేష్ గారి రేచీకటి ట్రాక్ చాలా బావుంటుంది.”
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో సోనాల్ చౌహన్, ప్రత్యేక గీతంలో పూజాహెగ్డే కనిపిస్తారు.