దేశ రాజధానిలో సంచలనం రేపిన అంజలి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక సాక్షి నిధిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆమె అంజలి స్కూటీపై ఉన్నట్టు ఇప్పటికే సీసీ టీవీ ఫుటెజీల్లో పోలీసులు గుర్తించారు. దీంతో యాక్సిడెంట్ సమయంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
నిధిని పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను పోలీసులు ఖండించారు. తాము నిధిని అరెస్టు చేయలేదని, కేవలం విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రమాద సమయంలో అంజలి మద్యం సేవించి స్కూటీ నడిపిందన్న నిధి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు విచారణ జరపుతున్నారు.
ఈ ఆరోపణలను అంజలి కుటుంబ సభ్యులు ఖండించారు. అటు అటాప్సీలోనూ మద్యం సేవించిన ఆనవాళ్లు దొరకలేదని అంజలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో నిధి చెప్పిన విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాక్సిడెంట్ తర్వాత నిధి ఎందుకు పారిపోయిందనే విషయంపై కూపీ లాగుతున్నారు.
పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిధిని గుర్తించిన తర్వాతే ఆమె బయటకు రావడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ క్రమంలో నిధిని ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో కీలక విషయం బయటపడింది.
యాక్సిడెంట్ సమయంలో కారు నడిపినట్లు భావిస్తున్న దీపక్ ఖన్నా ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా తన బంధువు కారు నడపడంతో అతన్ని కాపాడేందుకు దీపక్ ఖన్నా తానే కారు నడిపినట్టు చెప్పాడని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు కేసు నుంచి నిందితులను తప్పించేందుకు ఇద్దరు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరైన కారు యజమాని అశుతోష్‌ను పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అంకుశ్ కోసం గాలిస్తున్నారు.