ఢిల్లీలో కారు ఈడ్చుకుపోయిన ఘటనలో మరణించిన 20 ఏళ్ళ అంజలి సింగ్ స్నేహితురాలు నిధి పోలీసులకు షాకింగ్ వివరాలు చెప్పింది. డిసెంబరు 31 వ తేదీ రాత్రి తాను, అంజలి ఓ హోటల్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నామని, అనంతరం ఏదో విషయమై గొడవ పడ్డామని తెలిపింది. తరువాత దాదాపు రాజీకి వచ్చి ఇద్దరం స్కూటీపై బయల్దేరామని.. ఒకచోట వేగంగా వెళ్తున్న కారు తమ వాహనాన్ని ఢీ కొట్టిందని ఆమె వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరం కింద పడిపోయామని, అయితే ఆ కారు చక్రాల్లో అంజలి ఇరుక్కుపోయి హాహాకారాలు పెడుతున్నా.. దాన్ని నడుపుతున్నవారు కావాలనే ఆపలేదని ఆమె పేర్కొంది.
ఆ కారు లోని వారికి ఈ విషయం తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారని.. ఈ యాక్సిడెంట్ చూసిన తాను భయంతో అక్కడి నుంచి వచ్చేశానని నిధి చెప్పింది. తనకు స్వల్ప గాయాలైనట్టు ఆమె చెప్పింది.
‘అంజలితో నాకు 15 రోజుల క్రితమే పరిచయమైంది. కానీ కొద్ది రోజుల్లోనే స్నేహితులమై పోయాం.. ఇద్దరం కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం.. డిసెంబరు 31 న అంజలి నాకు ఫోన్ చేసింది. ఇద్దరం ఆ రోజు రాత్రి ఓ హోటల్ లో పార్టీ చేసుకున్నాం.. ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ ట్రక్ కూడా మా వాహనాన్ని ఢీ కొట్టబోయినా తప్పించుకున్నాం’ అని నిధి వివరించింది.
హిట్ అండ్ రన్ కేసులో బాధితురాలు అంజలి సింగ్ కుటుంబాన్నిఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కలిసి పరామర్శించారు. అంజలికి న్యాయం జరుగుతుందని చెప్పిన ఆయన.. ఈ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ కేసును వాదించేందుకు మంచి లాయర్ ని ఏర్పాటు చేస్తానని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.