‘విషము’నిమ్ము.. అని ఓ లేఖ రాసి పంపిస్తే దాన్ని ‘విషయ’ అన్నట్టుగా మార్చేసి ఎంచక్కా ఆ పేరుతో వున్న యువరాణినే పెళ్లాడి కూర్చున్న యువకుడి కథను చిన్నప్పుడు చందమామలో చదివేశాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్టీసీపై వేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసుల నివేదికను చూస్తే ఆ కథే గుర్తొస్తోంది. విద్యుత్ బస్పుల వాడకం వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీమొత్తంలో డబ్బు ఆదా అవుతుందట. ఓవరాల్‌గా ఈ కమిటీ నివేదిక తేల్చిన మేటర్ అదీ. ఇంకేముంది.. సర్కార్ వారు వెంటనే ఎవరక్కడ.. వెంటనే ‘మెఘా’వారిని పిలిపించి ఎలక్ర్టిక్ బస్సుల్ని ప్రవేశ పెట్టించండి.. అని అనడమే తరువాయి !
విద్యుత్ వాహనాల ద్వారా ఇంధనం ఆదా
పర్యావరణ పరిరక్షణకూ ఎలక్ట్రిక్ వాహనాలు
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులతో వ్యయ నియంత్రణ
సీఎం వైయస్ జగన్‌కు నిపుణుల కమిటీ నివేదిక
గుంటూరు : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని ఈ అంశంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వెల్లడించింది. తద్వారా సంస్థలో వ్యయ నియంత్రణ కూడా సాధ్యమని కమిటీ తెలియజేసింది. పర్యావరణ పరిరక్షణలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని కమిటీ తెలిపింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీసీ నిపుణుల కమిటీ ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక సమర్పించింది. సీయంను కలిసిన వారిలో ఆర్టీసీ ఎండీ మొవ్వ తిరుమల కృష్ణబాబు, కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత అధికారి ఆంజనేయరెడ్డి వున్నారు.
నిపుణుల కమిటీ సూచనలు ఇవీ..
- రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రవేశపెట్టడానికి అవసరమైన ఆర్థిక వనరుల కోసం ‘పర్యావరణ పరిరక్షణ నిధి’ ఏర్పాటుతో పాటు, ప్రత్యేకంగా ఈవీ బాండ్లు జారీ చేయాలి.
- జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సులభతరంగా, తక్కువ వడ్డీకే రుణాలు పొందగలిగితే, వీలైనంత త్వరగా ఆర్టీసీలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టవచ్చు. తద్వారా ఎంతో ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంది.
- విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్ వినియోగ అవకాశాలను పరిశీలించాలి.
- ఇందు కోసం సంస్థలో వీలున్న ప్రతి చోటా భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియలో సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు చూడాలి.
- సంస్థలో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాలు వినియోగిస్తే ఆదా అయ్యే ఇంధనం విలువను నగదు రూపంలో పరిగణించి, ఆ మొత్తాన్ని ఇవాళ్టి ఇంధన ధరలో రాయితీగా చూపితే తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు పొందవచ్చు.
- తిరుమలలో ప్రస్తుతం భక్తులకు ఉచితంగా సేవలందిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే టీటీడీ నిరంతరం కాంక్షించే పర్యావరణ పరిరక్షణ సాకారమవుతుంది.
- ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) ఛార్జింగ్ కోసం కొండ కింద అలిపిరితో పాటు, కొండపై తగిన భూమి కేటాయించాలి. ఈ మేరకు ప్రభుత్వం టీడీడీకి తగిన సూచనలు జారీ చేయాలి.
- రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఆ దిశలో కొన్ని చర్యలు చేపట్టాలి.
- ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి భేటీ కావాలి.
- రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రత్యేకంగా ఈ–బస్ బిజినెస్ డెవలప్‌మెంట్ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి.
- తద్వారా సంబంధిత విభాగంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను వేగంగా అమలు చేయడంతో పాటు, సంస్థకు అవసరమైన పథకాలను రూపొందించవచ్చు.
- స్థూల వ్యయ కాంట్రాక్టుల (జీసీసీ)ను సమీక్షించడం కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా కాంట్రాక్ట్ సమయంలో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా చేయవచ్చు.
- సంస్థలో 350 ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలి.
- ఇందులో రాయితీ పొందేందుకు ‘ఫేమ్–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాథాన్యత క్రమంలో వాటిని చేపట్టాలి.