కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వాటిని నివారించేందుకు అనేక రకాల చర్యలను చేపడుతున్నారు అధికారులు. ఓ పక్క టెస్ట్ లు చేస్తూనే మరో పక్క వ్యాక్సిన్ లను అందిస్తున్నారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.
అందులో వైద్యారోగ్య శాఖ పాత్ర కీలకమైనది. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనే దృఢసంకల్పంతో తమ ప్రాణాలకు తెగించి వారు ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సేవలను అందిస్తున్న వైద్యసిబ్బందికి మాత్రం రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు.
సహజంగా వ్యాక్సిన్ అనేది ప్రతీ ఒక్కరూ వేసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ.. అందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు నిరాకరిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల ఉపయోగమే తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదంటూ అవగాహన కల్పిస్తూనే ప్రజలకు వ్యాక్సిన్ అందరికి అందించేలా కృషిచేస్తున్నారు ఆరోగ్య సిబ్బంది.
అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన అండెం ఉపేంద్ర అనే ఏఎన్ఎం చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ వ్యాక్సిన్ అందించాలనే సదుద్ధేశ్యంతో ప్రజల వద్దకే పాలన అన్నట్టు.. పొలాల దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తుంది ఉపేంద్ర. అంతేకాదు.. టీకా వలన కలిగే ఉపయోగాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు ఆమె. ఉపేంద్ర పని శ్రద్దను చూసి పై అధికారులు సైతం అభినందిస్తున్నారు. అయితే తమ పై అధికారుల ప్రోత్సాహంతోనే తాను సేవలను అందించగలుగుతున్నానని అంటుంది ఏఎన్ఎం ఉపేంద్ర.