ప్రముఖ సామాజిక సేవకుడు అన్నా హజారే మహారాష్ట్ర సర్కారుకు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. సూపర్ మార్కెట్లు, రిటైల్ దుకాణాల్లో వైన్ ను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 3న లేఖ రాశారు.
వైన్ విక్రయాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించానని లేఖలో రాశారు హజారే. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖలు పంపారు.
తాను పంపిన లేఖలకు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని అన్నా హజారే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రానందున, మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు హజారే.
సూపర్ మార్కెట్లు, గ్రోసరీ దుకాణాల్లో వైన్ విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. అందుకు స్పందించిన హజారే.. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. రానున్న తరాల వారికి ఇది తీరని అన్యాయాన్ని చేకురుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హజారే.