ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. స్వపక్షంలోనే చిచ్చును రగిలిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై వైకాపా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆయన స్పష్టం చేశారు.
అన్నా..జగనన్నా..నీ ఫోన్ ట్యాప్ చేస్తే? ఎలా ఉంటుందని కోటం రెడ్డి సీఎం జగన్ ను నిలదీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
“కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా.. నా ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. సీఎం పై కోపంతో అధికారి అబద్దం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నా పై నిఘా పెట్టారు. అనుమానం ఉన్న చోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నా పై చర్యలు చేపట్టారు.
నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు,జడ్జిలు,మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ అయిండొచ్చు. మనసు ఒకచోట. శరీరం మరోచోట ఉండడం నాకిష్టం లేదు. అన్నా..జగనన్నా..నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది” అంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.