లాంగ్ గ్యాప్ తర్వాత నందినీరెడ్డి మరోసారి మెగాఫోన్ పట్టింది. ఆమె తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్. స్వప్న సినిమా, మిత్రవింద మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ఈసారి వేసవికి చల్లని చిరుగాలి అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. సంతోష్ శోభన్ ఎప్పట్లానే తన చలాకీతనంతో ఆకట్టుకోగా.. మాళవిక తన యాక్టింగ్ తో అదరగొట్టింది. సినిమాలో కీలక పాత్రలన్నింటినీ టీజర్ లో పరిచయం చేశారు. మరీ ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, గౌతమి, షావుకారు జానకి పాత్రలకు మంచి వెయిట్ ఉన్న విషయాన్ని టీజర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
టీజర్ కు మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నీ కూరపాటి, రిచర్డ్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే టీజర్ ఎడిటింగ్ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎమోషన్ అందించాల్సిన దగ్గర కూడా చకచకా ఫ్రేమ్స్ మార్చేసి, ఏ అనుభూతి అందకుండా చేశారు.
ఓవరాల్ గా చూసుకుంటే, స్వప్న సినిమాస్ అండతో వస్తున్న సంతోష్ శోభన్ ఈసారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మే 18న థియేటర్లలోకి వస్తోంది అన్నీ మంచి శకునములే సినిమా.