సాధారణంగా రాజకీయ నాయకులు.. సినీ ప్రముఖుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం చూస్తుంటాం. కానీ.. దానికి భిన్నంగా కొందరు చిన్నారులు, వారి తల్లిదండ్రులు మాత్రం వినూత్నంగా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ఆసక్తికర ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో 25 సంవత్సరాల క్రితం ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఎప్పుడు విద్యార్ధులతో కలకలలాడే పాఠశాల కరోనా కారణంగా విద్యార్థులెవరు రాకుండా అయింది. దీంతో 2018లో పాఠశాలను మూసివేశారు అధికారులు. కాగా.. కాలనీలోని చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ స్కూల్ లో చదువుకునే పరిస్థతి ఏర్పడింది.
అక్కడ నివసించే వారంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాలనీ వాసులంతా చిన్నారులతో కలిసి మార్చి 14న.. తమ పాఠశాలను ప్రారంభించాలని కలెక్టర్ శశాంక ను వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. ఆ పాఠశాలను తక్షణమే తెరవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
గతంలో ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మహ్మద్ అలీని పంపించి పాఠశాలను తెరిపించారు. కలెక్టర్ చేసిన ఉపకారానికి కాలనీలోని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ జిందాబాద్ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.