ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతూ.. మరో అరెస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే పది మంది అరెస్ట్ కాగా తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని సోమవారం విచారించిన ఈడీ అధికారులు.. రాత్రి పదకొండు గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11 కు చేరింది. త్వరలో ఇంకొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. మద్యం కుంభకోణంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నించింది. అదుపులోకి తీసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అరుణ్ పిళ్ళైకి చెందిన వట్టినాగులాపల్లిలో 2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ రామచంద్ర పిళ్లైను నిందితుడిగా ఈడీ పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్ కు చెందిన వారే ఉండడం గమనార్హం.
అయితే ఈ స్కామ్ లో అభిషేక్ బోయిన్ పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. కాగా, ఈ వరుస అరెస్ట్ ల నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. తర్వాతి అరెస్ట్ ఆమెనే అంటూ ప్రచారం జరుగుతోంది.