బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. అయితే ఈ సారి ఓ మహిళా ఈ ప్రయత్నం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమె దగ్గర నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నిజామాబాద్ నగరం.. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని బొంత సుగుణ అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అయితే దాని కంటే ముందు ఆమె ఇంట్లో నుంచి 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు మాక్లుర్ మండలం కల్లెడకు చెందిన ప్రసాద్ గౌడ్ వీటిని ఇచ్చినట్టు విచారణలో పోలీసులకు చెప్పింది. అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చని ప్రసాద్ గౌడ్ తన ఇంట్లో పెట్టాడని వెల్లడించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన కుట్రలో ప్రసాద్ గౌడ్, సుగుణ నిందితులుగా ఉన్నారు.
గతేడాది తుపాకీతో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రసాద్ గౌడ్ చొరబడగా భ్రదతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో తుపాకీ కొనుగోలు కోసం బొంత సుగుణ డబ్బులు ఇచ్చినట్లు గుర్తించారు. బెయిలుపై వచ్చాక సుగుణతో కలిసి ప్రసాద్ గౌడ్ పేలుడు పదార్థాలు తెప్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ చర్లపల్లి జైల్లో ఉన్నాడు.
బొంత సుగుణతో పాటు ప్రసాద్ గౌడ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే గతంలో మొదటి సారి నిందితుడు ఎమ్మెల్యే పై హత్యాయత్నం చేశాడు. 2022 ఆగష్టు, రెండో తేదిన రాత్రి ప్రసాద్ గౌడ్ బొమ్మ తుపాకీని నడుం వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మూడో అంతస్తు వరకు వెళ్లిపోయాడు. అయితే అతడ్ని ఎమ్మెల్యే గుర్తించి అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తి జీవన్ రెడ్డికి స్వల్పంగా గాయాలయ్యాయి