జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో 9 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక పెరెంట్స్.. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. నిందితుడు ఆటో డ్రైవర్ సలీంను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబసభ్యులను మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పరామర్శించారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వారితో మాట్లాడారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈటల. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. హైదరాబాద్ లో వరుస ఘటనలు వెలుగు చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని నిలదీశారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే దారుణాలు వెలుగు చూస్తున్నాయని ఆరోపించారు.
మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులంతా రాజకీయ నాయకుల కుమారులే కావడం చర్చనీయాంశంగా మారింది. అది ఇంకా మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.