కుక్కలే కాదు కోతులతో కూడా చిన్నారులకు రక్షణ లేని పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. అంబర్ పేట్ కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మర్చిపోక ముందే.. రెండు నెలల చిన్నారి వేలును కోతి కొరికేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది.
ఈ దారుణం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలం మోదుగుల గూడెంలో రెండు నెలల పాపపై కోతులు దాడి చేశాయి. ఇంటి వరండాలో చిన్నారిని పడుకోబెట్టడంతో.. చుట్టుముట్టిన కోతులు దాడికి దిగాయి. చిన్నారి కాలి బొటన వేలుని బలంగా కొరికాయి.
దీంతో ఆ చిట్టితల్లి అల్లాడిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు చిన్నారిని తీసుకొని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే బొటన వేలును కోల్పోయిన చిన్నారి శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం పసికందు వేలికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. అయితే ప్రాణాపాయం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే మహబూబాబాద్ ఏరియాలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. పట్టపగలు ఇంటి తలుపు తెరిస్తే చాలు.. వచ్చేస్తున్నాయి. కొన్ని సార్లు ఇంట్లో నివసిస్తున్న చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడులకు కూడా దిగుతున్నాయి ఈ కోతులు. ఈ విషయంలో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. చిన్నపాటి చర్యలు తీసుకొని ఊరుకుంటున్నారు. అయితే కోతులను పట్టుకొని.. వాటిని శాశ్వతంగా అడవులకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.