ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మరో భారీ ప్రచారానికి తెరలేవనుంది. ఈ సినిమా నుంచి త్వరలోనే రెండో లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నారు. ఈ లిరికల్ వీడియో కోసం భారీగా ప్లాన్ చేసింది యూనిట్. దేశమంతా ఒకే టైమ్ లో, ఈ సాంగ్ ను ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది.
రామ్ సియా రామ్ అనే లిరిక్స్ తో సాగే పాటను సెకెండ్ లిరికల్ వీడియోగా విడుదల చేయనుంది ఆదిపురుష్ టీమ్. ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రాయగా.. సచేత్-పరంపర కలిసి కంపోజ్ చేశారు. ఇప్పుడీ పాట విడుదలకు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసారు.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు.
ఇప్పటివరకు ఏ సినిమాకు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఆదిపురుష్ కోసం ఇలా దేశం మొత్తాన్ని ఏకం చేస్తున్నారు యూనిట్ జనాలు. ఆయా భాషలకు తగ్గట్టు ఈ సాంగ్ ను ప్రసారం చేస్తారు. ఉత్తరాదిన హిందీలో.. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో, తమిళనాడులో తమిళ్, కేరళలో మలయాళం, కర్నాటకలో కన్నడ భాషల్లో ఈ సాంగ్ సరిగ్గా 12 గంటలకు ప్రసారం అవుతుందన్నమాట.
మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు సాగుతున్నాయి. తిరుపతిలో వచ్చేనెల 6న గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఇది మొదటిది మాత్రమే. ఇలాంటి ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు మరో 3 జరగనున్నాయి