బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఈ మధ్యే తెలంగాణ ఉద్యమ నేత చకిలం అనిల్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ వార్త హాట్ టాపిక్ అవ్వగా.. లేటెస్ట్ గా మరికొంత మంది కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వనపర్తి జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర నాయకులు రాజీనామా చేశారు.
గత కొన్ని నెలలుగా మంత్రి నిరంజన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్న వర్గం.. గురవారం ఖిల్లా గణపురం మండలం సల్కలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమైన నేతలు, అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఈ విషయాలను అధిష్టానం దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ కారణంగానే రాజీనామాలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీలు, కిచ్చా రెడ్డి, మెగా రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
పార్టీకి రాజీనామా చేసిన తాము నెలరోజుల పాటు ఆయా మండలాలలో విస్తృతంగా పర్యటించి పదవులకు రాజీనామా చేసే విషయంపై నిర్ణయాలు తీసుకుంటామని.. ప్రజాభిప్రాయం మేరకు భవిష్యత్తు రాజకీయాల కోసం ఏ పార్టీలో చేరేది అనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.