వీధి కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 12న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న భరత్ పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.
తీవ్ర గాయాలైన బాలుడిని హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడి మృతితో తండాలో విషాధచాయలు అలుముకున్నాయి.
కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రవీణ్ నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.